విద్యుత్తులో న్యాయబద్ధమైన వాటా కావాలంటూ తెలంగాణ రాష్ట్రం కోరుతోంది. విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రయోజనాలు నెరవేరాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సద్భావం అవసరం. నీటి విషయంలో సీమాంధ్ర ప్రయోజనాలు తెలంగాణ ప్రభుత్వ సహకారంపైన ఆధారపడి ఉన్నాయి.
హుద్‌హుద్ తుపాను తీరం దాటినా, దీపావళి పం డుగ గడిచిపోయినా తెలుగునాట గాలిదుమారం, ధ్వని కాలుష్యం మాత్రం తగ్గలేదు. తెలుగు నేతలు కత్తులు దూసి నిప్పురవ్వలు పుట్టిస్తున్నారు. దాయాదుల మధ్య వాగ్యుద్ధం పతాకస్థాయికి చేరుతోంది. తెలంగాణ రైతుల పాలిట దయ్యంగా దాపురించావంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై తెలంగాణ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. నాయుడు నేరుగా తలబడకుండా అక్షరా యుధాలు సంధించగల నేర్పరి పరకాల ప్రభాకర్‌ను తిరుగుదాడికి పురమాయిం చారు. తోడుగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘు నాథరెడ్డి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంతరెడ్డి తదితరులు ఉండనే ఉన్నారు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు మరోసారి ఎదురుదాడి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ సకల కష్టాలూ, నష్టాలూ మరచిపోయి టీవీ చానళ్ళలో రసవత్తరమైన, ఉత్కంఠభరితమైన నాటకం తిలకించి తరిస్తున్నారు. కరెంటు కోతల గురించి తెలంగాణ ప్రజలూ, రైతుల రుణమాఫీ, తుపాను బాధితులకు సహాయక చర్యల గురించి ఆంధ్రులూ తమ ప్రభుత్వాలను ప్రశ్నించే వాతావరణం లేదు.
తాజా కలహకారణం శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమల ఉన్న విద్యుత్ కేంద్రా లలో ఉత్పత్తి కొనసాగించడం. జలాశయంలో నీటిమట్టం కనీస స్థాయికంటే కిందికి పోతే రాయలసీమ ప్రజలకు తాగునీరు కూడా అందని దుస్థితి దాపురిస్తుందనే ఆందోళన వ్యక్తంచేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుడివైపు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిపివేసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అదే పనిచేయాలంటూ రకరకాల ఒత్తిళ్ళు తెస్తున్నది. తెలంగాణ సర్కారు ససేమిరా అంటున్నది. విద్యుదుత్పత్తిని ఆపుచేసి రైతుల ప్రాణాలు తీయలేమంటూ హరీష్‌రావు స్పష్టం చేశారు. ఈ వివా దాన్ని ముఖ్యమంత్రులు ఇద్దరూ చర్చించుకొని పరిష్కరించుకోవాలంటూ కేంద్ర విద్యుత్ మంత్రి పియూష్ గోయెల్ మరోసారి హితవు చెప్పారు. ఈ నెల 29న కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశం జరగబోతోంది. అందులోనూ ఖరారు నిర్ణయం జరగకపోవచ్చు. ఒకవేళ బోర్డు ఎడమవైపు కేంద్రంలో విద్యుదుత్పత్తి నిలిపివేయాలంటూ నిర్ణయించినా, ఆ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకపోతే ఏమి చేయాలన్నది ప్రశ్న. రెండు వైపులా బలమైన వాదన లు ఉన్న మాట నిజం. ఎవరి వాదన ఏమిటో పరిశీలిద్దాం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన:
1) శ్రీశైలం నీటి మట్టం 856 అడుగులకు చేరింది. జలాశయం నుంచి ఇంకా నీరు విడుదల చేసే పక్షంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటి సరఫరా ఆగిపో తుంది. రాయలసీమకు తాగునీటి సమస్య ఏర్పడుతుంది. 2) జీవో 69, జీవో 107 లకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నీటిని వాడుకుంటోంది. 3) రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ముందుగా తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలి. తర్వాత సాగు నీరు. అనంతరమే విద్యదుత్పత్తికి నీటిని వినియోగించాలి. ఈ చట్టాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. 4)నీరు వృథాగా పోయి సాగర్, పులిచింతల జలాశయాలు కూడా నిండి సముద్రం పాలవుతుంది.
తెలంగాణ ప్రభుత్వం ఏమంటోంది? 1) తెలంగాణలో విద్యుత్తు లేకపోతే నీరు లేదు. భూగర్భజలాలపైన ఆధారపడిన ప్రాంతంలో విద్యుచ్ఛక్తి ద్వారానే నీరు పైకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో భూమ్యాకర్షణ శక్తి వల్ల నీరు పారుతుంది. తెలం గాణలో లిఫ్ట్ ఇరిగేషనే శరణ్యం. 2) కృష్ణా జలాలలో నికర జలాలూ, వరద జలాలూ కలిపి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 60 టీఎంసీల దాకా వినియోగించింది. ఇది బచావత్ ట్రిబ్యూనల్ అవార్డు కేటాయించిన నీటి మొత్తం కంటే ఎక్కువ. 3) జీవో 69ని ఉల్లంఘిస్తున్నామనడం తప్పు. జీవో 107లో ప్రభుత్వం అవసరమని భావిస్తే శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854 అడుగుల కంటే కిందికి పడిపోయినా కూడా నీరు విడుదల చేయవచ్చు (ఇందులో కూడా తాగునీటికీ తర్వాత సాగునీటికీ ప్రాధాన్యం ఇవ్వాలనీ, తర్వాతే విద్యుదుత్పత్తికి నీటిని వినియోగించాలనీ ఉంది). 4) ఉమ్మడి రాష్ట్రంలో జీవో 107కు భిన్నంగా 854 అడుగులకంటే నీటి మట్టం తగ్గిన తర్వాత కూడా విద్యుదుత్పత్తి చేసిన సందర్భాలు అనేకం. ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు? ఎవరి వాదన వారికి న్యాయసమ్మతంగా కనిపిస్తుంది. ఎవరి సమర్థకులు వారికి ఉన్నారు. ఈ పరిస్థితికి నేపథ్యం ఏమిటి?
తుపాను బీభత్సం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విద్యుత్ సంక్షోభం సృష్టిం చింది. అంతవరకూ కాస్త మెరుగ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అకస్మాత్తుగా విద్యుత్ కొరత ఏర్పడితే అసలే కటకటగా ఉన్న తెలంగాణ గింగిరాలు తిరిగింది. తుపాను తాకిడికి గాజువాక-జేపోర్ లైను కుదేలు కావడంతో రెండు రాష్ట్రాలూ దారుణంగా నష్టపోయాయి. విద్యుచ్ఛక్తి రంగంలో దేశాన్ని ఐదు విభాగాలు చేశారు. నార్త్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్, సదరన్ రీజియన్స్‌గా విభజించారు. న్యూగ్రిడ్‌లో దక్షిణాది (సౌత్) మినహా తక్కిన నాలుగు ప్రాంతాలూ అనుసంధానమై ఉన్నాయి. దక్షిణాదితో న్యూగ్రిడ్ అనుసంధానం సంపూర్ణం కాలేదు. ఉత్తరాదిలో మిగులు విద్యుత్తును దక్షిణాదికి రవాణా చేసేందుకు ప్రస్తుతం గాజువాక-జేపోర్, చంద్రాపూర్- రామ గుండం, తాల్చేర్-కోలార్, రాయచూర్-షోలాపూర్ లైన్స్ ఉన్నాయి. ఈ లైన్ల ద్వారా మొత్తం 4,500 మెగావాట్ల విద్యుత్ రవాణా అవుతోంది. ఇప్పుడు నిర్మాణం లో ఉన్న మరి నాలుగు లైన్లు పూర్తయితే ఇంకా 10 నుంచి 12 వేల మెగావాట్ల విద్యు త్తు రవాణా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉత్తరాదిలో మిగులు ఉన్న విద్యుత్తు వివిధ దక్షిణాది రాష్ట్రాలకు రవాణా అవుతోంది. ఈ ఏర్పాట్లు ఇదివరకే జరిగిపోయాయి. కొత్తగా విద్యుత్తు లభించే అవకాశం లేదు. తుపాను వచ్చే వరకూ తెలంగాణ రాష్ట్రం ఉత్తరాది నుంచి నిత్యం 10 నుంచి 15 మిలియన్ (ఒక మిలియన్ అంటే పది లక్ష లు) యూనిట్ల విద్యుత్తును ఈస్టర్న్ గ్రిడ్ ద్వారా పవర్ ఎక్స్‌చేంజి నుంచి కొనుగోలు చేసేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అదే మార్గంలో ఐదు మిలియన్ యూనిట్లు కొనుక్కునేది. గాజువాక-జేపోర్ లైను కుప్పకూలడంతో ఈ రవాణా ఆకస్మికంగా ఆగిపోయింది. తుపాను రావడానికి పూర్వం ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సరఫరా కాస్త నయం. కరెంటు కోత లేకుండా 24 గంటలూ సరఫరా చేస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే పరిస్థితి. కానీ తెలంగాణలో అప్పటికే దాదాపు 30 మిలియన్ యూనిట్ల కొరత పీడిస్తోంది. మూడేళ్ళ వరకూ కోతలు ఉంటాయనీ, ఆ తర్వాత కనురెప్పపాటు కూడా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉండబోదనీ తెలంగాణ ముఖ్యమంత్రి హామీ ఇవ్వవలసిన పరిస్థితి.
ఈస్టర్న్ గ్రిడ్ నుంచి సరఫరా నిలిచిపోవడానికి తోడు సింహాద్రిలో 2,000 మెగావాట్ల ఎన్‌టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) విద్యుత్ కేంద్రం తుపాను కారణంగా మూతపడింది. ఈ కేంద్రం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు 53.89: 46.11 నిష్పత్తిలో విద్యుత్తు వాటా రావాలి. ఈ వాటా అందక పోవడంతో తెలంగాణలో విద్యుత్ సంక్షోభం మరింత తీవ్రతరమైతే ఆంధ్రప్రదేశ్‌లో సైతం విద్యుత్తు సరఫరా కష్టతరమై కోత విధించక తప్పనిస్థితి ఏర్పడింది. ఆంధ్ర ప్రదేశ్‌లో కొన్ని చిన్న చిన్న ప్రైవేటు విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తి చేసిన విద్యుత్తును ప్రభుత్వానికి విక్రయించేవి. అవి కూడా తుపాను దెబ్బకు మూలనపడ్డాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడగా తెలంగాణలో అది 40 మిలియన్ యూనిట్లు దాటింది..
ఈ నేపథ్యంలో శ్రీశైలం కుడిఎడమల విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తి చేయవలసిన అవసరం రెండు రాష్ట్రాలకూ ఏర్పడింది. కుడివైపు (ఏపీ) జలవిద్యుత్ ప్రాజెక్టు సామర్థ్యం 770 మెగావాట్లు అయితే ఎడమగట్టు (తెలంగాణ) విద్యుత్ కేంద్ర సామర్థ్యం 900 మెగావాట్లు (ఇందులో 800 మెగావాట్ల మేరకు ఉత్పత్తి జరుగుతోంది). తుపాను తీరం దాటి వెళ్ళిపోగానే రెండు రాష్ట్రాలూ శ్రీశైలం ప్రాజె క్టుల నుంచి ఉత్పత్తి ప్రారంభించాయి. నీటి మట్టం తగ్గిపోతుండటంతో ఆందోళన చెందిన పార్లమెంటు సభ్యుడు ఎస్‌పీవై రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైన ఒత్తిడి తెచ్చి కుడి ప్రాజెక్టు ఉత్పత్తి ఆపు చేయించారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం తగ్గిపోతే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా నీరు సరఫరా కాజాలదనీ, రాయలసీమ ప్రజలకు తాగునీరు కూడా అందని దుస్థితి దాపురిస్తుందనీ భయం.
కుడివైపు ప్రాజెక్టు ఉత్పత్తి నిలుపు చేసినప్పటికీ ఎడమవైపు విద్యుత్ కేంద్రం నుంచి 15 నుంచి 18 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతూనే ఉంది. అప్పటికీ తెలంగాణలో కొరత 20 నుంచి 30 మిలియన్ యూనిట్లు ఉంది. ఈ దశలో ఆంధ్ర ప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావుకు ఫోన్ చేసి శ్రీశైలం ఎడమ జలవిద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి నిలిపి వేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుదుత్పత్తిని కొనసాగించి నీటి వాడకం ఆపకపోతే రాయలసీమకు తాగునీటి కొరత, సాగునీటి కొరత ఏర్పడతాయని వివరించారు. ఉమామహేశ్వరరావు విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం మన్నించలేదు. రైతులనూ, పంటలనూ కాపాడుకోవడం కోసం విద్యుదుత్పత్తి కొనసాగించక తప్పదనీ, ఆపేది లేదనీ కుండబద్దలు కొట్టింది. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. 1969లో జారీ చేసిన 69వ నంబరు జీవోనూ, 2006లో వచ్చిన 107 నంబరు జీవోనూ తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిం చిందంటూ ఆరోపించింది.
ఇందుకు తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఏమిటంటే, బచావత్ అవార్డును గౌరవించాలంటూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కూడా ఆదేశించిందనీ, బచావత్ ట్రిబ్యూనల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాలలో తెలుగుగంగ ద్వారా చెన్నై పట్టణానికి 15 టీఎంసీల (ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల వాటాలలో తలా ఐదు టీఎంసీలు) నీరు వాడుకోవచ్చుననీ, ఇది కాకుండా శ్రీశైలం కుడి కాలువ ద్వారా 19 టీఎంసీల నీరు వినియోగించుకోవచ్చుననీ, నికర జలాలూ, వరద జలాలూ కలిపి దాదాపు 60 టీ ఎంసీల దాకా ఇంతవరకూ వినియోగించుకున్నారనీ వాదించి ఆంధ్ర ప్రదేశ్ తనకు కృష్ణా ట్రిబ్యూనల్ కేటాయించిన నీటి కంటే ఎక్కువే వినియోగించు కున్నదని తేల్చింది. జలవిద్యుదుత్పత్తిని నిలుపు చేయాలనే నిబంధన 69వ జీవోలో ఎక్కడా లేదనీ, నిజానికి పక్షానికి కనీసం ఆరు టీఎంసీల నీరు వంతున విద్యుదు త్పత్తి కోసం విడుదల చేయాలంటూ ఆ జీవోలో ఉన్నదని తెలంగాణ సర్కారు వాదన. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 834 అడుగుల కంటే తగ్గకుండా చూడా లనే అంశం కూడా ఇదే జీవోలో ఉంది. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న కాలంలో (2006లో) విడుదలైన 107వ నంబరు జీవోలో మాత్రం కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండాలని నిర్దేశించారు. అయితే నీటి మట్టం కనీసస్థాయి కంటే తగ్గినా సరే నీటిని వినియోగించడం అత్యవసరమని ప్రభుత్వాలు భావించిన పక్షంలో ఆ విధంగా విచక్షణాధికారాలు ఉపయోగించి నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఆ జీవోలో కల్పించారు. శ్రీశైలం ఎడమగట్టున విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తికోసం వినియోగించే నీరు అనంతరం నాగార్జునసాగర్‌కూ, ఆ తర్వాత పులి చింతలకూ, అక్కడి నుంచి కృష్ణా బరాజ్‌కు వెళ్ళి నిల్వ ఉంటాయి కానీ వృథాగా సముద్రంలో కలిసిపోతాయనడం వాస్తవం కాదని కూడా తెలంగాణ ప్రభుత్వం అంటోంది. పైగా 2006లో 107వ జీవో విడుదలైన దరిమిలా ప్రతి సంవత్సరం శ్రీశైలం నీటిమట్టం 854 అడుగుల కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా జలవిద్యుదు త్పత్తి జరిగింది. ఈ యేడాది మార్చిలో సైతం కనీస నీటిమట్టం కంటే తక్కువ స్థాయిలో ఉన్న దశలో శ్రీశైలం ప్రాజెక్టుకు కుడిఎడమల కేంద్రాలలో విద్యుదుత్పత్తి కొనసాగిందని గుర్తుచేస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వ వాదనలో తెగింపు ధోరణి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలో కొన్ని అసంబద్ధతలూ, ద్వంద్వప్రమాణాలూ ఉన్నాయి. ఒకటి, వైఎస్ హయాంలో రాయలసీమ ప్రాంత ప్రయోజనాలు పరిరక్షించేందుకు 107 జీవోను విడుదల చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిం చింది. ‘గుట్టుగా పెరిగిన నీటి మట్టం’ అంటూ నాటి పత్రికలు పతాక శీర్షికలతో వార్తలు ప్రచురించాయి. టీడీపీ జీవో 107 పైన దృశ్యరూపకం రూపొందించి మేలు చేయాల్సిన రాజే కీడు చేస్తున్నాడంటూ, సాగర్, డెల్టా రైతులు ఆందోళన చెందు తున్నారంటూ, డెల్టా అంతా ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదంటూ విమర్శించింది. ఇందుకు సంబంధించిన వార్తాకథనాలు పత్రికలలో, టీవీ చానళ్ళలో వచ్చాయి. ఇప్పుడు అదే జీవోను ఉల్లంఘిస్తున్నదంటూ తెలంగాణ ప్రభుత్వంపై తెలుగుదేశం ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. రెండు, ఒకవైపు నీటి విడుదలకు సంబంధించి జీవో 69ని తెలంగాణ ప్రభుత్వం తుచ తప్పకుండా పాటించాలని పట్టుబడుతున్న చంద్ర బాబునాయుడు విద్యుత్ పంపకాలకు సంబంధించి గతంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన జీవో 53కు చట్టబద్ధత లేదని వాదిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర అవస రాల దృష్ట్యా గతంలో జారీ చేసిన జీవోలు చెల్లవన్నది ఆయన వాదన. విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి, విద్యుత్తులో వాటాకు సంబంధించిన పాత జీవోలు చెల్లవంటే జీవో 69, జీవో 107 కూడా చెల్లవు మరి. మూడు, శ్రీశైలం నీటి విడుద లను నిలుపు చేయడానికి కృష్ణా బోర్డు జోక్యం చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చిన చంద్రబాబునాయుడు సీలేరు విద్యుత్ విషయంలో గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఇచ్చిన ఉత్తర్వులనూ, పవర్ పర్చేజి అగ్రిమెంట్ల (పీపీఏల) విషయంలో ఆంధ్రప్రదేశ్ విద్యుచ్ఛక్తి నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ), సదరన్ రీజినల్ లోడ్ డిశ్పాచ్ సెంటర్ (బెంగళూరు) జారీ చేసిన ఆదేశాలనూ బేఖాతరు చేశారు. చట్టబద్ధత కలిగిన సంస్థల ఆదేశాలను స్వయంగా ఉల్లంఘిస్తూ కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఇచ్చిన ఆదేశాలను మాత్రం తెలంగాణ ప్రభుత్వం శిరసావహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదనలో పస కనిపించదు.
విద్యుత్తులో న్యాయబద్ధమైన వాటా కావాలంటూ తెలంగాణ రాష్ట్రం కోరుతోం ది. విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రయోజనాలు నెరవేరాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సద్భావం అవసరం. నీటి విషయంలో సీమాంధ్ర ప్రయోజనాలు తెలం గాణ ప్రభుత్వ సహకారంపైన ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికే రాయలసీమకూ, దక్షిణ తెలంగాణకూ మధ్య శ్రీశైలం ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కారణంగా ద్వేషభావం నెలకొని ఉన్నది. నదీజలాలకూ, విద్యుత్‌కూ మధ్య అవినాభావ సంబం ధం ఉంది. తెలంగాణకూ, ఆంధ్రప్రదేశ్‌కూ మధ్య విడదీయలేని బంధాలు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు. ఒకరికి ఒకరు అతుక్కుపోయి పుట్టిన కవల పిల్లలు (సియామీజ్) ఎంత గింజుకున్నా ఎవరిదారిన వారు వెళ్ళలేరు. కలసి కదలాల్సిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కూడా నీరు, విద్యుత్తు అదే విధంగా కట్టిపడ వేశాయి. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా, అర్థం చేసుకున్నా చేసుకోనట్టు నటించి అసలైన సమస్యలపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు ఈ సమస్యను విని యోగించుకోవాలనుకుంటే అది వారి ఇష్టం. ఇదే విధంగా కలహించుకుంటూ ఉంటే అందరం నవ్వులపాలవుతాం. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం ప్రకటిం చినా, న్యాయస్థానం తీర్పు ఇచ్చినా దాన్ని అమలుచేయడానికి సీఆర్‌పీఎఫ్ బల గాలనో, సైన్యాన్నో నియమించవలసిన పరిస్థితులు ఏర్పడితే రెండు రాష్ట్రాల ప్రజల మధ్య శాశ్వత శత్రుత్వం ప్రబలుతుంది. తెలుగుజాతికి తీరని అపకారం జరుగు తుంది. అది ఇద్దరు చంద్రులకీ చెరగని మచ్చ తెస్తుంది.
0 comments:
Post a Comment