Total Pageviews

పదవులు... ప్రమాణాలు!

రాజ్యాంగమైనా, చట్టాలైనా సర్వ సమగ్రంగా ఉండటం సాధ్యంకాదు. ప్రజాస్వా మ్యంలో ఉన్నత స్థానాల్లోని వ్యక్తులకుండే అధికారాలు, పరిధులు, పరిమితుల వంటి అంశాలపై రాజ్యాంగం సవివరంగానే ప్రస్తావించినా...అన్నిటినీ ముందే ఊహించి చెప్పడం కుదరదు గనుక అది సంపూర్ణమనలేం. అందుకే అవసరాన్ని బట్టి రాజ్యాంగానికి సవరణలొస్తున్నాయి. కొత్త కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయి. అయినా సమస్యలు వస్తూనే ఉంటాయి. పరిష్కారాన్ని కోరుతూనే ఉంటాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినవారు ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా వెళ్లడం సబబేనా అనేది అలాంటి సమస్యే. ఉన్నత స్థానాల్లోని వ్యక్తులు తమ నిర్ణయాలద్వారా, తమ ప్రవర్తనద్వారా ఉన్నత ప్రమాణాలను నెలకొల్పు తారు. కాలక్రమంలో అవి సంప్రదాయంగా స్థిరపడతాయి. ఆ సంప్రదాయాన్నే అందరూ పాటిస్తారని, పాటించాలని కోరుకోవడం కూడా అత్యాశే. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకునే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం కేరళ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఏకవాక్యంతో తోసిపుచ్చింది. న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు రిటైరయ్యాక ఏ ఇతర పదవినైనా చేపట్టడానికి నిర్దిష్ట కాలావధిని నిర్దేశించాలని పిటిషనర్ కోరారు. ఇలాంటి నిబంధనలను రూపొందించే పని నిజానికి న్యాయవ్యవస్థది కాదు. ఆ పని చేయాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థ. జస్టిస్ సదాశివం నిరుడు జూలై నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకూ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. నాలుగు నెలల విరామం అనంతరం గత నెల 5న కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు.  మామూలు సందర్భాల్లో ఏమయ్యేదోగానీ ఎన్డీయే సర్కారు యూపీఏ హయాంలో నియమి తులైన గవర్నర్లను రాజీనామా చేయాలని హుకుం జారీచేయడం, అందుకు ససేమిరా అన్నవారిని మారుమూల రాష్ట్రాలకు బదిలీ చేయడం వంటి చర్యలు తీసుకోవడంతో వాటి చుట్టూ బోలెడంత వివాదం అలుముకున్నది. ఈ నేప థ్యంలో అలాంటి వివాదాస్పద పదవిని అంగీకరించడం ఏమిటని కొందరు అభ్యం తరం చెప్పగా... సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి అంతకంటే తక్కువ స్థాయి పదవిని ఒప్పుకోవడం సబబుగాలేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. రిటైర్మెంట్ అనంతరం గవర్నర్ పదవి వంటి రాజకీయ నియా మకానికి సంసిద్ధత చూపడంవల్ల న్యాయవ్యవస్థ విశ్వసనీయత దెబ్బతింటుందని ఆందోళనపడినవారు కూడా ఉన్నారు. జస్టిస్ రాజిందర్ సచార్ వంటి న్యాయ కోవిదులైతే సదాశివం చర్య ఔచిత్యభంగమేకాక...సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి పదవికుండే గౌరవప్రపత్తులకు కూడా విఘాతమని వ్యాఖ్యానించారు.

న్యాయమూర్తులుగా పనిచేసి రాజకీయ పదవులను అంగీకరించడం సదాశివంతోనే ప్రారంభం కాలేదు. గతంలో కాంగ్రెస్ పాలకులు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైరైన ఫాతిమా బీవీని తమిళనాడు గవర్నర్‌గా నియమించారు. అలాగే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణచేసిన రంగనాథ్ మిశ్రాను రాజ్యసభకు నామినేట్ చేశారు. యూపీఏ పాలనా కాలంలో 22మంది న్యాయమూర్తులు పదవీ విరమణ చేయగా వారిలో 18మందికి వివిధ కమిషన్లలోనూ, ట్రిబ్యునల్స్‌లోనూ పునరావాసం లభించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసినవారు పదవులను అంగీకరించవచ్చునా, అంగీకరిస్తే అవి ఏ స్థాయి పదవులై ఉండాలన్న విషయంలో స్పష్టత లేదు. రాజ్యాంగం దాన్ని గురించి ఏమీ చెప్పడం లేదు. రాజ్యాంగ పదవుల్లో పనిచేసినవారు రిటైరయ్యాక కనీసం రెండేళ్ల అనంతరం మాత్రమే ఎలాంటి పదవినైనా అంగీకరించాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ ఒక సందర్భంలో సూచించారు. రిటైర్మెంట్ అనంతరం కొన్నేళ్లపాటు కొత్త పదవులకు దూరంగా ఉండాలని ఈమధ్యే రిటైరైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లోథా అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్‌గా ఉంటూ 1969లో హిదయతుల్లా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు. అప్పట్లో ఉపరాష్ట్రపతిగా ఉంటూ తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు చూస్తున్న వి.వి.గిరి పదవినుంచి తప్పుకుని రాష్ట్రపతి పదవికి పోటీచేయడంతో హిదయతుల్లా ఆ బాధ్యతలు చేపట్టాల్సివచ్చింది.  కనుక ప్రొటోకాల్ ప్రకారమైతే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిల తర్వాత ప్రాధాన్యతాక్రమంలో మూడో స్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిదే. అంతటి ఉన్నత స్థానంలో పనిచేసివున్న సదాశివం అంతకంటే తక్కువ స్థాయిలోని గవర్నర్ పదవిని అంగీకరించడం సబబుగా లేదన్నది కొందరి అభ్యంతరం.

ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉంటున్నారు గనుక అరుణ్‌జైట్లీ ఏమంటారో గానీ... రెండేళ్లక్రితం విపక్ష నేతగా ఉన్నప్పుడు మాత్రం న్యాయమూర్తులుగా పనిచేసేవారు రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ పదవులను అంగీకరించరాదని సూచించారు. అంతేకాదు...కొందరు న్యాయమూర్తులు ఈ తరహా పదవులు ఆశించి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు రాస్తున్నారని కూడా ఆరోపించారు. దీనికితోడు సదాశివంను గవర్నర్‌గా నియమించగానే అమిత్ షాపై ఉన్న కేసు విషయంలో ఉదారంగా వ్యవహరించడంవల్లనే ఆయనకు ఈ పదవి దక్కిందని కాంగ్రెస్ ఆరోపించింది. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల మాటెలా ఉన్నా న్యాయవ్యవస్థ విశ్వనీయతనూ, ప్రమాణాలనూ కాపాడాలనుకుంటే ఇలాంటి రాజకీయ నియామకాలకు న్యాయమూర్తులు మొగ్గు చూపకపోవడమే ఉత్తమం. అలా చేయొద్దని రాజ్యాంగం చెప్పకపోవచ్చు. సీవీసీ వంటి పదవుల విషయంలో ఉన్నట్టు చట్టమూ ఉండకపోవచ్చు. కానీ, తమ నిర్ణయం ఒక సత్సంప్రదాయానికి బాటలువేయాలి తప్ప అనవసర వివాదాలకు తావీయరాదని సదాశివం వంటి వారు గుర్తిస్తే మంచిది.
Share on Google Plus

About nellore people puls

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment