Total Pageviews

రోమియో యూజర్ రివ్యూ


ఈ సినిమా రోమ్‌లో రిలీజ్ కాలేదు కాబ‌ట్టి స‌రిపోయింది. లేదంటే `మా దేశంలో ఇలాంటి దిక్కుమాలిన సినిమా తీస్తారా` అనో మా రోమియో పేరుని త‌గ‌లేస్తారా? అనో - ఈ సినిమా తీసినోళ్ల‌పై, చ‌ట్టం స‌పోర్టు చేస్తే చూసినోళ్ల‌పై కూడా రోమ‌న్లు కేసులు వేసేవాళ్లు.
ఏంటా సినిమా?
ఏంటా క‌థ‌....?
దానికి తోడు పూరి రాసిన ప్రేమ క‌థ అన్న ట్యాగ్ లైన్ ఒక‌టి. అస‌లు పూరి మార్క్ ఏది?  అస‌లు ఈ సినిమాలో ప్రేమేది?  అస‌లు క‌థేది??రోమియో అన‌గానే ప్ర‌పంచానికి ఓ అద్భుత‌మైన ప్రేమ క‌థ గుర్తొస్తుంది. ఇక‌పై తెలుగువాడికి మాత్రం - రోమియో అనే పీడ‌క‌ల వెంటాడుతుంటుంది.రోమియో కాదు.. ఇది మ‌న ఖ‌ర్మ కాలియో!

ఇది పూరి నాలుగేళ్ల క్రితం రాసుకొన్న క‌థ‌ట‌!  నిజ‌మే చెప్పాడు. మంచి క‌థైతే ర‌వితేజ‌తోనే ఎప్పుడో పూరి సినిమా తీసేసేవాడు. సేల్ అవ్వ‌లేదు కాబ‌ట్టే.. ఇన్నాళ్లు ఉండిపోయింది.  పాపం... త‌మ్ముడికీ, శిష్యుడికీ అంట‌గ‌ట్టి - ఈ క‌థ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో ట్రైల్ వేసుకొన్నాడు. వెరినో వెళ్లి పూరి ఈ క‌థ రాశాడ‌ట‌. ఆ మాత్రం దానికి అక్క‌డికి వెళ్లాలా??  విశాఖ బీచ్‌లో కూర్చుంటే బ‌ఠానీలు తింటూ బోలెడు క‌థ‌లు రాసుకోచ్చు. మ‌రి పూరి రోమ్‌లో రాసిన ఆ క‌థ‌లో ఏముందంటే...

స‌మంత (అడోనిక‌) అమెరికా అమ్మాయి. ఇండియాలో పుట్టినా అమెరికాలో పాతుకుపోయారు. త‌న‌కి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అదీ ఒంట‌రిగా వెళ్లిపోతుంటుంది. ఓసారి రోమ్ బ‌య‌ల్దేరుతుంది. అక్క‌డ కిట్టూ (సాయి) క‌నిపిస్తాడు. కిట్టు స‌మంత‌ని చూడ‌గానే షాక్ తింటాడు. కావాల‌ని వెంబ‌డిస్తాడు.  వెంట ప‌డ‌తాడు. స‌మంత‌ పాస్‌పోర్ట్ దాచేసి, దొంగ ఎత్తుకెళ్లిపోయాడ‌ని అబ‌ద్ధాలాడ‌తాడు. ఈ సంగ‌తి స‌మంత‌కి తెలిసిపోతుంది. సంగ‌తేంట‌ని నిల‌దీస్తుంది. నాకు ప‌ద్దు అనే మ‌ర‌ద‌లుంది. త‌ను నీలాగే ఉంటుంది. ఈమ‌ధ్య చ‌నిపోయింది. ప‌ద్దు రూపంలో ఉన్నావ్ కాబ‌ట్టే నీ వెంట ప‌డుతున్నా, నువ్వు న‌న్ను పెళ్లి చేసుకో.. లేదంటే పాస్‌పోర్ట్ ఇవ్వ‌ను అని బెదిరిస్తాడు కిట్టూ. అయితే అప్ప‌టికే స‌మంత మ‌రొక‌రి ప్రేమ‌లో ఉంటుంది. మ‌రి సమంత‌ని కిట్టూ ఎలా త‌న దారిలోకి తెచ్చుకొన్నాడనేదే ఈ సినిమా క‌థ‌.

ఈ సినిమా గొప్ప‌ద‌నం ఏంటంటే రెండు మూడు సీన్లు చూసేస‌రికి ఈ సినిమా మ‌న‌కు క‌నెక్ట్ కాద‌ని అర్థ‌మైపోతుంది. ఓవ‌రాక్ష‌న్‌కి ప్ర‌తిరూపంలా ఉండే హీరోయిన్‌, నిద్ర‌లేమి వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్టు క‌నిపించే హీరో, అటు వైపు న‌లుగురు, ఇటువైపు న‌లుగురు ప‌ట్టుకొని లాగుతున్న‌ట్టున్న స‌న్నివేశాలు, మార్చురీలోని శ‌వానికి ఆప‌రేష‌న్ చేసి, బ‌తికించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టున్న స‌న్నివేశాలూ..
 వోరినాయ‌నో - ఇది సినిమా కాదు.. న‌ర‌కంలో పెట్టే టార్చ‌ర్‌కి మినీ ట్రైల‌ర్‌!

ఏ సినిమాలో అయినా ఏదోటి బాగుంటుంది. రెండు సీన్లో, ఓ జోకో, లేదంటే టేకాఫో, ఇంట్ర‌వెల్ బ్యాంగో... ఏదోటి ఛ‌మ‌క్ మంటుంది. ఈ సినిమాలో అలాంటిది ఒక్క‌టీ లేదు. బ‌హుశా ''శుభం'' కార్డొచ్చిన‌ప్పుడు మాత్రం జ‌నం కేరింత‌లు కొడ‌తారేమో..?!  ఇంటికెళ్తూ వెళ్తూ క్షేమంగా బ‌య‌ట‌కు వ‌చ్చినందుకు గుడికెళ్లి కొబ్బ‌రికాయ్‌లు కొట్టినా కొట్టొచ్చు.

ఈ సినిమాకి అస‌లు విల‌న్ ఎవ‌డ‌య్యా అంటే.. హీరోనే. అదెలా అంటారా??  ఓ అమ్మాయి ఆల్రెడీ ఓ అబ్బాయిని ప్రేమించింది. అయినా స‌రే.. న‌వ్వు న‌న్నే చేసుకో, వాడ్ని కావాలంటే చంపేయ్ అని స‌ల‌హా ఇచ్చినోడిని ఏమ‌నాలి..??  శాడిస్ట్ అనాలి, లేదంటే విల‌న్ అని గౌర‌వంగా పిలుచుకోవాలి. అదేం ఖ‌ర్మో పూరి సినిమాలో మాత్రం వాడే హీరో.!

ఓ అమ్మాయికి మ‌త్తు మందించి, ఆ మ‌త్తులో అమ్మాయి తేలుతున్న‌ప్పుడు శరీరాన్ని ఆబ‌గా న‌లిపేసేవాడిని ఏమ‌నాలి??  తెలుగులో కామ పిచానీ అంటారు. తెలుగు సినిమాలో మాత్రం... వాడే హీరో!

అస‌లు ఈ సినిమా టేకాఫ్ ప‌ర‌మ కంప‌రం కొడుతుంది. తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి చ‌నిపోయింది. అదే రూపంలో మ‌రో దేశంలో ఓ అమ్మాయి ఎదురైంది. అలాంట‌ప్పుడు అబ్బాయి రియాక్ష‌న్ ఎలా ఉంటుంది?  ఈ సినిమాలో మాత్రం... `దొరికిందిరా.. అదిక్క‌డ ఉందిరా. ఈ రాత్రికి ఏదోటి చేసేస్తా..` అంటాడా??  కానీ ఈసినిమాలో అన్నాడు.. వాడే హీరో!!

క‌థ నీర‌సంగా ఉంటే, క‌థ‌నం శ‌వానికి డెక‌రేష‌న్ చేసిన‌ట్టుంది. స్పీడో మీట‌ర్ వైర్లు తెంపేసిన‌ట్టు ముందుకు జ‌ర‌గ‌దే. క‌థ‌నం మ‌రింత ఫ్లాటుగా రాసుకొని ప్రేక్ష‌కుల‌కు విర‌క్తిని సిరంజిల ద్వారా ఇంజెక్ట్ చేశాడు ద‌ర్శ‌కుడు. పూరి క‌థ అలా ఉంది. పాపం.. ఆయ‌న మాత్రం ఏం చేస్తాడు..?  మ‌రో సంగ‌తి. ఈసినిమాకి మాట‌ల ర‌చ‌యిత కూడా పూరినే. పూరి డైలాగులు భ‌లే ఉంటాయ‌ని, పంచ్ ఉంటుంద‌ని, పొగ‌రు ఉంటుంద‌ని అంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం అన్నీ రివ‌ర్స్‌. పూరి ఇంత తెలివి త‌క్కువ‌గానూ డైలాగులు రాస్తాడా అనిపించింది.
ఓ సీన్‌లో.. హీరోయిన్‌ని సుబ్బ‌రాజు కిడ్నాప్ చేయిస్తాడు.
ఆ సంగ‌తి హీరోయిన్‌ని తెలుస్తుంది.
వెంట‌నే హీరోయిన్ సుబ్బ‌రాజుకి ఫోన్ చేస్తుంది.
అప్పుడు సుబ్బ‌రాజు డైలాగ్ - `ఏంటి?  నువ్వు ఇంకా కిడ్నాప్ కాలేదా?` అని.  ఛ‌స్‌.. పూరిపై ఉన్న హోప్స్ మొత్తం పోయాయ్‌. ఈ ఒక్క డైలాగ్‌తో.


ర‌వితేజ‌, జ‌య‌సుధ‌, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, అలీ... ఈసినిమాలో వీళ్లూ ఉన్నారు. కానీ ఏం లాభం?  సెల్ ఫోన్ కంపెనీ యాడ్ లా.. ఫోన్‌లో మాట్లాడుతూనే క‌నిపిస్తారు.
హీరో ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసే స‌న్నివేశం ఎంత సీల్లీగా ఉందంటే.. మాట‌ల్లో చెప్ప‌లేం. అంత సీరియ‌స్ సీన్ మ‌రీ అంత సిల్లీగా తీస్తాడా??  క‌థ‌లో డెప్త్ పెర‌గాల్సిన చోట - డెడ్ బాడీని చేసేశాడు. ఒక్క దెబ్బ‌తో. శుభం కార్డు వేయాలి కాబట్టి, సుబ్బ‌రాజుని విల‌న్‌ని చేసి - హీరోయిజం ఎలివేట్ చేసి.. క‌థ‌కి పుల్‌స్టాప్ పెట్టాడు. చేసేదేం లేక‌.  పాచిపోయిన కూర‌లో కొత్తిమీర డెర‌రేట్ చేస్తే ఏంటీ, చేయ‌క‌పోతే ఏంటీ అన్న‌ట్టు సాంకేతిక విభాగం కూడా ఈసినిమాని ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. సంగీతం, కెమెరా, మాట‌లు, ఎడిటింగ్ అన్నీ చేతులెత్తేశాయ్‌. దాంతో సినిమాలో ప్ల‌స్ పాయింట్స్ రాసుకొనే అవ‌స‌రం త‌ప్పింది.

రెండేళ్లు ల్యాబ్‌లోనే మ‌గ్గిన సినిమా ఇది. అక్క‌డే ఉంటే బాగుండేది. రోమియో పేరుకి గౌర‌వం అలానే ఉండేది. పాపం సాయిరామ్ శంక‌ర్ సినిమా బ‌య‌ట‌కు రాలేదు అనే సింప‌తీ ఉండేది. మ‌న డ‌బ్బులు మ‌న ద‌గ్గ‌రే ఉండేవి. త‌ల‌నొప్పి ట్య‌బ్లెట్ల‌కు డిమాండ్ పెర‌గ‌డానికి త‌ప్ప‌.. ఇలాంటి రోమియోల వ‌ల్ల లాభ‌మేమి...??

Share on Google Plus

About nellore people puls

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment