2014 సంవత్సరానికి త్రిపురనేని గోపీచంద్ జాతీయ పురస్కారాన్ని సుప్రసిద్ధ ఉర్దూ రచయిత్రి జిలానీబానోకు ప్రకటించారు. 2007 నుంచి ప్రకటితమవుతున్న ఈ అవార్డును ఇప్పటి వరకూ డా.శివశంకరి (తమిళం), డా.ప్రతిభారాయ్ (ఒరియా), రావూరి భరద్వాజ, అంపశయ్య నవీన్ అందుకున్నారు. ఈ సంవత్సరం జిలానీబానోకు అందించనున్నట్టు త్రిపురనేని సాయిచంద్ తెలిపారు. అవార్డు కింద 25,000 రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం ఉంటాయి.
నవంబర్ 2న హైదరాబాద్‌లోని లామకాన్‌లో జరిగే ఒక కార్యక్రమంలో ఈ పురస్కారం అందజేస్తారు. జిలానీబానో స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని బదయూన్ అయినా చాలాకాలం క్రితమే వారి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. ఆమె తండ్రి హైరత్ బదయూని కవి. అయితే తల్లి జిలానీబానోని ఈ సాహిత్య విషయాల్లోకి దూరకుండా జాగ్రత్త పడేది. ముఖ్యంగా ఇస్మత్ చుగ్తాయ్ పుస్తకాలు కంటపడకుండా చూసేది. అయినప్పటికీ దొరికిన పుస్తకమల్లా చదివి జిలానీబానో రచయిత్రిగా మారారు.
ఆమె తొలి కథ ‘మోమ్ కి మరియమ్’ ప్రచురితమైనప్పుడు ఇంటా బయటా చాలా గొడవ జరిగిందనీ ఒక ఆడపిల్ల కథ రాయడం ఏమిటనే నిరసన ఎదురైందని ఆమె చెప్తారు. అయితే ఆ కథను ప్రఖ్యాత కవి మగ్దూమ్ మొహియుద్దీన్ చూసి ఇంత చిన్న వయసులో ఇంతమంచి కథ రాశావా అని మెచ్చుకోవడంతో ఆ తర్వాత ఎవరూ జిలానీబానోకు అడ్డురాలేదు. ఆమె దాదాపు 22 పుస్తకాలు రాసినా వాటిలో కథలు ప్రసిద్ధం. ముఖ్యంగా ఆమె రాసిన ‘నర్సయ్యా కీ బావ్‌డీ’ (నర్సయ్య బావి) చాలా ప్రసిద్ధమైనది. ఇటీవలే శ్యామ్ బెనగళ్ ఆ కథను ‘వెలడన్ అబ్బా’ పేరుతో చలన చిత్రంగా రూపొందించారు.
0 comments:
Post a Comment