చంద్రబాబు ఓ దగా కోరు.. అబద్ధాల కోరు
సీమాంధ్రులను నిండా మోసం చేస్తున్నడు
టీఆర్‌ఎస్‌లోకి టీడీపీ ఎమ్మెల్యేలు తీగల, తల సాని, ఎమ్మెల్సీ గంగాధర్
సాక్షి, హైదరాబాద్: ‘‘పొట్ట చేతబట్టుకుని హైదరాబాద్‌కు బతకడానికి వచ్చిన వారంతా తెలంగాణ బిడ్డలే. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన నిరుపేదలను సైతం కన్నబిడ్డల్లా కడుపులో పెట్టుకుని చూసుకుంటాం..’’ అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సీమాంధ్రులకు తెలంగాణ ప్రభుత్వం రెడ్‌కార్పెట్ వేస్తుందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ఓ దగాకోరని, ఆయన చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని మండిపడ్డారు. బాబును నమ్మితే సున్నం పెడతాడే కానీ అన్నం పెట్టడని విమర్శించారు. హైదరాబాద్ శివార్లలోని మీర్‌పేటలో బుధవారం నిర్వహించిన సభలో టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి టీఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడారు.
హాలీవుడ్‌ను తలదన్నేలా సినీ పరిశ్రమ
దేశం గర్వపడే విధంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను రూ. 10 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. అంతర్జాతీయ నగరాలను మించిన మహా నగరాన్ని నిర్మిస్తామన్నారు. హాలీవుడ్‌ను తలదన్నేలా సినీ పరిశ్రమను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ చెప్పారు. ‘‘హైదరాబాద్‌లో 1,700 మురికి వాడలున్నాయి. వీటిలో సుమారు 20 లక్షల మంది నివసిస్తున్నారు. ఏ బస్తీలో నివసిస్తున్న వాళ్లకు ఆ బస్తీలోనే ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తుందని హామీ ఇస్తున్నా. ఎన్టీఆర్‌నగర్ వాసులకు త్వరలో పట్టాలు పంపిణీ చేస్తాం..’’ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. టర్కీలోని ఇస్తాంబుల్ నగరాన్ని వారసత్వ సంపద దెబ్బతినకుండా ఏ విధంగా అభివృద్ధి చేశారో.. అదే తరహాలో వారసత్వ సంపదకు నష్టం కలుగకుండా హైదరాబాద్‌లోని పాతబస్తీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ మేరకు అధ్యయనం చేసేందుకు త్వరలో గ్రేటర్ ప్రజాప్రతినిధులు, అధికారులను త్వరలో ఇస్తాంబుల్‌కు పంపించనున్నట్లు సీఎం తెలిపారు. చంచల్‌గూడ జైలును చర్లపల్లికి తరలించి.. ఇక్కడ ముస్లిం పేద విద్యార్థుల కోసం విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న రేస్‌కోర్స్‌ను శివారుకు తరలించి.. రేస్‌కోర్స్ స్థలంలో వంద ఎకరాల్లో విద్యాలయాలు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. పేకాట క్లబులు, జూదాలాడే రేస్‌కోర్స్‌లు మనకు అవసరమా..? అని వ్యాఖ్యానించారు.
దమ్ముంటే రైతుల రుణాలు మాఫీ చెయ్యి..
ఏపీ సీఎం చంద్రబాబుకు దమ్ముంటే ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలను మాఫీ చేయాలని కేసీఆర్ సవాలు చేశారు. ‘‘టీఆర్‌ఎస్ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని తప్పకుండా అమలు చేస్తున్నాం. ఇప్పటి కే రైతులకు సంబంధించిన రూ. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేశాం. అదే చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలకు సంబంధించిన రూ. 1.54 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిండు. వాటి అమలు సాధ్యం కాదని చెప్పిన ఇతర పార్టీల నేతలను దబాయించిండు. తీరా అధికారంలోకి వచ్చినంక వాటిని పట్టించుకోకుండ అక్కడి రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నడు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు.. చంద్రబాబుకు దమ్ముంటే రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేసి చూపించాలె..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్, చంద్రబాబు పాలన వల్లే నేడు తెలంగాణ రైతులకు కష్టాలు వచ్చాయని... వారు అనుసరించిన తప్పుడు విధానాలే విద్యుత్ సంక్షోభానికి కారణమని ఆరోపించారు. తాను చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేదన్నారు. తెలంగాణకు మూడేళ్ల పాటు కరెంట్ కష్టాలు తప్పవని ఎన్నికల ప్రచార సభల్లోనే చెప్పానని కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో తెలంగాణలోని ప్రతి పల్లెకు వాటర్‌గ్రిడ్ ద్వారా మంచి నీరు అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, పద్మారావు, మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, కర్నె ప్రభాకర్, సలీం, వెంకటేశ్వర్లు, నరేందర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కొంటావా?: - చంద్రబాబుపై తలసాని మండిపాటు
‘‘మేం ఎటో పారిపోతున్నట్లు మమ్ములను ఓ గదిలో బంధించి నీకు ఏం కావాలి? నీ కుటుంబానికి ఏం కావాలి? అంటూ బాబు సొంత పార్టీ ఎమ్మెల్యేతోనే బేరాలు ఆడుతున్నాడు. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కొంటావా? నీకేమైనా సిగ్గుందా..?’’ అంటూ తలసాని శ్రీనివాస్‌యాదవ్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తాము యాచించే వాళ్లం కాదని, హైదరాబాద్‌ను శాసించే వాళ్లమని వ్యాఖ్యానించారు. తమ సత్తా ఏమిటో త్వరలోనే తెలుస్తుందని, వంద జన్మలెత్తినా తమలాంటి నేతలను తయారు చేయలేవని చంద్రబాబుపై మండిపడ్డారు. ‘‘తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లోంచి కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లింది. బాబు కళ్లకు కాంట్రాక్టర్లు మినహా కార్యకర్తలెవరూ కనిపించడం లేదు. కొంతమంది చంద్రబాబు బంట్రోతులు బ్రోకర్లలా మాట్లాడుతున్నారు..’’ అని తలసాని విమర్శించారు. బతకడానికి వచ్చి తెలంగాణలో స్థిరపడిన ప్రతి ఒక్కరికి టీఆర్‌ఎస్ అండగా నిలుస్తుందని చెప్పారు.
తల్లిరుణం తీర్చుకునేందుకే..: తీగల
తెలంగాణ తల్లి రుణం తీర్చుకునేందుకే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చెప్పారు. తెలంగాణలో రంగారెడ్డి జిల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని.. అది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంటామన్నారు.
బంగారు తెలంగాణ కోసమే..: గంగాధర్‌గౌడ్
చంద్రబాబు సహా కొంత మంది సీమాంధ్రులు ఇప్పటికీ తెలంగాణ ఏర్పాటును జీర్ణించుకోలేక పోతున్నారని ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ చెప్పారు. బంగారు తెలంగాణ ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమని.. నవ తెలంగాణ నిర్మాణంలో భాగస్వామిగా మారేందుకే తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని పేర్కొన్నారు.
0 comments:
Post a Comment